Bangladesh : అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాక.. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటు విమర్శలు చేశారు.
Read Also: Telangana Bill : ‘ప్రత్యేక తెలంగాణ’ బిల్లుకు 11 ఏళ్లు
విద్యార్థులు చేసిన ఆందోళనలకు అనేకమంది పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారు. అయినా యూనస్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అవామీ లీగ్ పార్టీ నాయకులు ఓపికగా.. ఐక్యంగా ఉండాలి. నేను నా దేశానికి తిరిగి వస్తా. పార్టీ కార్యకర్తల మృతికి ప్రతీకారం తీర్చుకుంటా. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తా. జులై- ఆగస్టుల్లో జరిగిన నిరసనల్లో మరణించినవారు పోలీసుల కాల్పుల కారణంగా చనిపోలేదు. ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజాలు రుజువు అవుతాయని హసీనా అన్నారు.
దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉంది. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి, ప్రజల భద్రత ప్రమాదంలో ఉంది. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని ఆమె పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆందోళనల్లో మృతిచెందిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా మాట్లాడారు. దేశాన్ని నడపడంలో తనకు ఎలాంటి అనుభవం లేదని గతంలోనే ఆయన అంగీకరించారు. అన్ని విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై, అధికారులపై దాడులు చేయడం యూనస్ అసమర్థతకు నిదర్శనం. ప్రణాళికతోనే నా తండ్రి నివాసాన్ని నాశనం చేశారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగలేదని హసీనా అన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
Read Also: BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !