Amrit scheme : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని, ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అన్నారు. తెలంగాణలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్ అన్నారు. మా ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నాం.
మరి సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 26 పైసలు కూడా రాలేదు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి తలెత్తింది. అందుకే అక్కడ తిరుగుబాటు మొదలైంది. అస్మదీయులకు లబ్ధి చేకూర్చారని ఝార్ఖండ్ సీఎంపై కేసు పెట్టారు. అదే కేసును రేవంత్, పొంగులేటిపై ఎందుకు పెట్టడం లేదు?” అని కేటీఆర్ ప్రశ్నించారు. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూ. 1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారన్నారు. 2021-22 లో శోధా కన్‌స్ట్రక్షన్ నికర ఆదాయం రూ. 2.2 కోట్లు మాత్రమేనని, అలాంటి కంపెనీకి రూ. 800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అమృత్ పథకం టెండర్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో వివరాలు లేవని, కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాగా, రాహుల్ గాంధీ మహరాష్ట్రలో అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మహరాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ సొమ్ములు తరలిపోతున్నాయని, ఇక్కడి ప్రజల సొమ్మును దోచుకుని అక్కడ ఎన్నికల్లో వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇచ్చిన హమీలు అమలు చేయకుండా, అమలుకు నిధులు లేవంటూనే.. అన్నీ అమలు చేసేశామంటూ మహారాష్ట్రలో అబద్ధాలను ప్రచారం చేయడమే కాకుండా దాని ప్రచారం కోసం అడ్డగోలుగా వందల కోట్ల ప్రజా ధనాన్ని వాడుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ అమ్జద్ ఖాన్ జయంతి.. విలన్ పాత్రతో హీరో ఇమేజ్