What Is Sky Bus : ఇప్పుడు మన దేశంలో స్కై బస్ సర్వీసు గురించి మరోసారి చర్చ మొదలైంది. తొలి విడతగా ఢిల్లీ – గురుగ్రామ్ మధ్య స్కై బస్ సర్వీసును ప్రారంభించాలని కేంద్ర సర్కారు యోచిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల మెట్రో రూట్లలో, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో స్కై బస్ సర్వీసు అంటే ఏమిటి ? అదెలా పని చేస్తుంది? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
స్కైబస్ ఎలా ప్రయాణిస్తుంది ?
- స్కై బస్ అనేది మెట్రో రైలులాగే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ.
- ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఎలివేటెడ్ ట్రాక్‌ను నిర్మిస్తారు. ఆ ట్రాక్ కు కేబుల్స్ లేదా బస్సు తరహా బోగీలు కనెక్ట్ అయి ఉంటాయి.
- ఈ బోగీలు ట్రాక్ నుంచి కిందకు వేలాడుతున్నట్లు కనిపిస్తాయి. అయస్కాంత, గురుత్వాకర్షణ శక్తితో ఇవి ట్రాక్ కు వేలాడుతూ ప్రయాణిస్తాయి. అందుకే ఈ సర్వీసును స్కై బస్ అని పిలుస్తుంటారు.
- అచ్చం మెట్రో రైలులాగే స్కై బస్ లు కూడా రాకపోకలు సాగిస్తాయి.
- స్కై బస్సులు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.
- ఇవి విద్యుత్తుతో నడుస్తాయి.
- ఈ సర్వీసుల నిర్వహణ వ్యయం మెట్రో రైళ్ల కంటే తక్కువే.
అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లోనే..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా రూ.100 కోట్లతో గోవాకు స్కై బస్ ప్రాజెక్టును ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మపుసా నుంచి పనాజీ వరకు స్కై బస్ సర్వీసు ట్రాక్ ను నిర్మించారు. అయితే 2016లో అకస్మాత్తుగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. స్కైబస్ సర్వీసుల ప్రాజెక్టు అంత లాభదాయకంగా ఉండకపోవచ్చనే కారణంతో రైల్వే శాఖ ఆ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ఆ దిశగా ప్రతిపాదనలు తెరపైకి రావడం గమనార్హం. ఇప్పుడు ఇండియా చాలా మారింది. ప్రజలు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారు. ఖర్చు ఎక్కువైనా ప్రయాణించేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందువల్లే ఇండియాలో మెట్రో రైళ్లు, వందే భారత్ వంటివి సక్సెస్ అయ్యాయి. స్కై బస్ సర్వీసులు కూడా సక్సెస్ అవుతాయనే ఆశాభావంతో ఇప్పుడు మళ్లీ ఇండియా వాటి వైపు(What Is Sky Bus) అడుగులు వేస్తోంది.