Delhi Assembly Elections : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం ప్రకటించారు. “ఒకవైపు కాంగ్రెస్ మితిమీరిన విశ్వాసం, మరోవైపు బీజేపీ దురహంకారం చూస్తున్నాం. అయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. గత పదేళ్లుగా మేము చేసిన అభివృద్ధి మాట్లాడుతుంది.. మేము తలదించుకుని ప్రజల ముందుకి వెళతాం ” అని చెప్పారు. 2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండవచ్చని అంచనా. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది.
Read Also: Kim Jong Un : సరిహద్దుల మూసివేత.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని ప్రియాంకా కక్కర్ అన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు “పెద్ద గుణపాఠం” అని ఫలితాల అనంతరం ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అతి విశ్వాసంతో వెళ్లవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమించాలని కార్యకర్తలను హెచ్చరించారు. ”ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. వాటిని తేలిగ్గా తీసుకోవద్దు. మితిమీరిన విశ్వాసం వద్దు. ప్రతి ఎన్నిక.. సీటు గెలుచుకోవడం రెండూ కష్టమే” అని మంగళవారం నిర్వహించిన ఆప్ కౌన్సిలర్ల సమావేశంలో పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణపై వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్..ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి