Revanth Reddy : కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు.
అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కార్ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, అలా తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్లపై తమ అభ్యంతరం తెలపగా తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు.
Read Also: CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం
తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని సీఎం తెలిపారు. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదు. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్‌లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
బనకచర్లపై ఏపీ సర్కార్ ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపుపైనా చర్చించాం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగాం. మొత్తం ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం. ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగాం. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని చెప్పామన్నారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరాం. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించాం. కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కోరామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Read Also: Hyderabad Tour : హైదరాబాద్ ఒకరోజు ఫుల్ టూర్.. ఛార్జీ రూ.430 మాత్రమే