Site icon HashtagU Telugu

Amit Shah : ఇంకా ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

War on terror is not over yet.. Union Home Minister Amit Shah

War on terror is not over yet.. Union Home Minister Amit Shah

Police Commemoration Day : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. డ్రగ్స్‌, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్‌ షా అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ”మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్‌, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము” అని షా అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్‌ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Read Also: Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!