వైసీపీ (YCP) నేతలంతా జనసేన (Janasena) బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు జనసేన తీర్థం పుచ్చుకోగా..తాజాగా మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini Joins Janasena) జనసేన లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజిని.. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించింది. 2011లో హైదరాబాదు మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. పూర్తి చేసింది. అనంతరం ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేసింది. రజిని తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుండి తిరిగి వచ్చి తన భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చిలకలూరిపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది.
విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టిడిపి పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో 2018లో వైసీపీలో చేరింది. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జగన్ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
ఇక 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి చేతిలో 51150 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం ఈమె జనసేన లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటూ తర్వాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీ నుంచి బయటకు వస్తూ జగన్ కు షాక్ ఇస్తున్నారు. వైసీపీ లో వెలుగు వెలిగిన విడదల రజిని పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలే వెల్లడిస్తున్నాయి. అయితే రజిని మాత్రం ఆమె రాజీనామా విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. చూద్దాం మరి రజిని దీనిపై ఎప్పుడు రియాక్ట్ అవుతుందో..!!
Read Also : Chandrababu : నాలుగు నెలల్లో కూటమి సర్కార్ రూ. 47 వేల కోట్ల అప్పు – పేర్ని నాని