United Nations : ఉద్యోగాల కోత (లేఆఫ్స్) అనే పదం ఇప్పటివరకు ఐటీ రంగానికే పరిమితమై ఉందని అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు ఈ సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపుతున్నదని తెలుస్తోంది. శాంతి, మానవతా సేవలకు ప్రతీకగా ఉన్న ఐక్యరాజ్యసమితి (United Nations – UN) కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నదన్న వార్తలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల మధ్య యూఎన్ తమ సిబ్బందిలో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రంగం, స్టార్ట్‌అప్స్, పెద్ద కార్పొరేట్ సంస్థలూ ఆర్థిక మాంద్యం, ఆదాయాల్లో తగ్గుదల, కృత్రిమ మేధ (AI) వినియోగం పెరగడం వంటివి ఉద్యోగాల కోల్పోతానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఇదే తరహా సవాళ్లు ఐక్యరాజ్యసమితిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే నిధుల్లో జాప్యం, కోతలే యూఎన్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయని విశ్లేషకుల అభిప్రాయం.
Read Also: AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు
యూఎన్ సెక్రటేరియట్ వారి వార్షిక బడ్జెట్ (సుమారు $3.7 బిలియన్లు)లో 20 శాతం తగ్గింపు చేయాలని యోచిస్తోంది. ఇది ఒక పెద్ద నెంబరే కాదు, యూఎన్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపగలదు. బడ్జెట్ కోతల్లో భాగంగా దాదాపు 6,900 మంది ఉద్యోగులను జూన్ 13వ తేదీ నాటికి తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. యూఎన్ బడ్జెట్‌లో ముఖ్యమైన వాటా అమెరికాదే. దాదాపు 25 శాతం నిధులను అమెరికా ప్రభుత్వం సమకూర్చుతుంది. కానీ గత కొంత కాలంగా ముఖ్యంగా ట్రంప్ హయాంలో అమెరికా విదేశీ సహాయ నిధుల్లో కోతలు విధించడం వల్ల యూఎన్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే అమెరికా నుంచి $1.5 బిలియన్ నిధులు రావాల్సి ఉంది. అయితే అందులో జాప్యం, నిశ్చితతలేకపోవడం యూఎన్‌ను సంక్షోభంలోకి నెట్టింది.
యూఎన్ కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్ ఈ పరిస్థితులపై స్పందిస్తూ, అమెరికా సహాయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా, ప్రపంచం మొత్తం నుంచి నిరంతర సహకారం అవసరం అని అన్నారు. 21వ శతాబ్దంలో ప్రజలకు మెరుగైన భవిష్యత్తు అందించాలంటే, ఐక్యరాజ్యసమితి కార్యాచరణకు స్థిరమైన నిధుల అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా నిధుల కొరత వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని సూచిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లాంటి ప్రపంచ స్థాయి మానవతా సంస్థ ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితిలో పడటం శోచనీయం. ఇది అంతర్జాతీయ మానవతా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరిన్ని దేశాలు తమ బాధ్యతను గుర్తించి యూఎన్‌కు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలన్నది నిపుణుల అభిప్రాయం. ఈ పరిస్థితి, ఉద్యోగాల కోత అనే అంశం ఇక ఏ రంగానికీ పరిమితం కాదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది.