Union Cabinet : పరిశోధన, ఆవిష్కరణల అభివృద్ధి, క్రీడా రంగం బలోపేతానికి కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రైవేటు రంగం పాత్రను విస్తరించేందుకు రూపొందించిన పరిశోధన- అభివృద్ధి- ఆవిష్కరణ (RDI) పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత రుణాలను పొందే వీలుంటుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ రూపంలో నిధుల సౌలభ్యం కల్పించనుంది. ప్రైవేటు రంగం నిధుల కొరతతో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది భారతదేశంలో ఆవిష్కరణల శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని కేంద్రం అభిప్రాయపడింది.
Read Also: BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి
ఈ పథకానికి దిశానిర్దేశం చేయడం కోసం ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఉన్న అనుసంధన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పాలక మండలికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇక దేశంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్రం కీలకంగా స్పందించింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడాకారుల అభివృద్ధిని లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం (National Sports Policy – 2025)కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిద్వారా గ్రామీణ స్థాయిలో నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను అభివృద్ధి చేసే లక్ష్యం ఉంది. తక్కువ వయస్సు నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించనున్నాయి.
తయారీ రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు అమలులో ఉండనున్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి రూ.1.07 లక్షల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద అధికంగా ఉద్యోగాలు కల్పించే తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉపాధిని కేంద్రంగా పెట్టుకుని దేశీయ ఉత్పత్తి శక్తిని పెంచేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, తమిళనాడులో రహదారి అభివృద్ధికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరమకుడి-రామనాథపురం మధ్య ఉన్న హైవే విస్తరణకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కిలోమీటర్ల పొడవైన రహదారిని విస్తరించనున్నారు. మొత్తం రూ.1853 కోట్ల వ్యయంతో ఈ హైవే నిర్మాణం జరగనుంది. ఇది ఆ ప్రాంతానికి ట్రాన్స్‌పోర్ట్, ఆర్ధికాభివృద్ధి దిశగా మద్దతు ఇవ్వనుంది. ఈ నిర్ణయాలన్నీ దేశ అభివృద్ధి దిశగా కీలక మలుపుగా కేంద్రం భావిస్తోంది. పరిశోధన, క్రీడలు, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో ప్రగతికి ఇది బలమైన అడుగుగా నిలవనుంది.
Read Also: Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు