Site icon HashtagU Telugu

Ukraine : రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త పథకం

Ukraine- Russia

Ukraine- Russia

Ukraine :  ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు తీవ్రంగా కొనసాగుతుండటంతో, వాటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. సైన్యం ప్రమేయం లేకుండానే, శిక్షణ పొందిన పౌరులను వాడేందుకు ఉద్దేశించిన ఈ స్వచ్ఛంద కార్యక్రమం ఇప్పటికే మంత్రివర్గ ఆమోదాన్ని పొందింది. ఈ కొత్త కార్యక్రమం కింద రష్యా నుంచి వస్తున్న డ్రోన్‌లను గుర్తించి, వాటిని నేలకూల్చే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించనున్నారు. ఈ వాలంటీర్లు మానవరహిత విమానాలు, యాంటీ-డ్రోన్‌ ఆయుధాలను వినియోగించి డ్రోన్‌ వ్యతిరేక చర్యలు చేపడతారు. దీనికోసం వారికి నెలకు సుమారుగా రూ.2.2 లక్షల వరకు పారితోషికం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు!

ఉక్రెయిన్‌ ప్రభుత్వ ప్రతినిధి తారస్‌ మెల్నిచుక్‌ మాట్లాడుతూ, ఈ చెల్లింపులు స్థానిక బడ్జెట్‌ నుంచే చేపడతామని, ఈ పథకం మిలిటరీ పరిపాలన (మార్షల్‌ లా) అమలులో ఉన్నంతకాలం అంటే కనీసం రెండేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. వాలంటీర్ల ఎంపికలో డ్రోన్ ఆపరేటింగ్‌ నైపుణ్యాలు కలిగిన పారామిలటరీ సభ్యులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పౌరులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలే ప్రత్యక్షంగా దేశ రక్షణలో భాగస్వాములు కావడం ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఆశిస్తోంది. డ్రోన్‌ దాడుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో, రష్యా సంచలనాత్మకంగా ఇరాన్‌కు చెందిన షహీద్‌ డ్రోన్‌లను ఉక్రెయిన్‌పై వదులుతోంది. వీటిని ప్రధానంగా విద్యుత్‌ వ్యవస్థలపై, పౌర మౌలిక సదుపాయాలపై దాడుల కోసం వినియోగిస్తోంది.

ఈ విధంగా పౌరల సహకారంతో ఏర్పాటు చేసిన డ్రోన్‌ రక్షణ వ్యవస్థ ద్వారా, ఉక్రెయిన్‌ తన వైమానిక పరిరక్షణలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ఇదే సమయంలో, ఉక్రెయిన్‌ తన డ్రోన్‌ సామర్థ్యాన్ని కూడా విస్తరిస్తోంది. ఇటీవల ‘స్పైడర్‌ వెబ్‌’ అనే ప్రత్యేక డ్రోన్‌ మిషన్‌ ద్వారా కీవ్‌ రష్యాపై భారీ దాడులకు తెరతీసింది. ఈ చర్యలు రష్యా దాడుల్ని తిప్పికొట్టేందుకు కీలకంగా మారనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త చర్యలు ఒకవైపు ప్రజల దృఢనిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంటే, మరోవైపు రష్యా ముప్పును ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నాయి. సైనిక విభాగం నుంచి పౌర రంగానికి మారుతున్న ఈ వైమానిక రక్షణ విధానం గ్లోబల్‌ స్థాయిలో ఆసక్తి రేపుతోంది.

Read Also: CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు