Ukraine: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా బుధవారం రాజీనామా చేశారు. కులేబా రాజీనామా అభ్యర్థనను తదుపరి పార్లమెంటరీ సమావేశంలో చట్టసభ సభ్యులు చర్చిస్తారని పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ సెఫాన్‌చుక్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉండవచ్చని, అలాగే కొత్త నియామకాలు కూడా ఉండవచ్చని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఎల్వీవ్‌పై జరిగిన దాడిలో సుమారు ఏడుగురు మరణించడం, 35 మంది గాయపడటంతో విదేశాంగ మంత్రి రాజీనామా వచ్చింది అని నగర మేయర్ ఆండ్రీ సడోవి బుధవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు. మరణించిన వారిలో ఓ చిన్నారి, వైద్యకార్యకర్త ఉన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లోని పోల్టావాలో మిలటరీ అకాడమీ, సమీపంలోని ఆస్పత్రిని రెండు బాలిస్టిక్ క్షిపణులు పేల్చివేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. క్షిపణులు పోల్టావా మిలటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రధాన భవనంలోకి చొచ్చుకుపోవడంతో పలు అంతస్థులు కూలిపోయాయి.
కాగా, డిమిట్రో కులేబా మార్చి 2020లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పొరుగున ఉన్న రష్యా చేస్తున్న దండయాత్రను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో 2016-2019లో కౌన్సిల్ ఆఫ్ యూరోప్‌కు ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. ఇదిలా ఉంటే, శీతాకాలానికి ముందు ప్రభుత్వం తన మంత్రివర్గంలో కొత్త ముఖాలను చూడాలని భావిస్తుంది. దాదాపు 50 శాతం కంటే ఎక్కువ మంది రాజీనామా చేయడంతో పాటు ఆ పదవుల్లో కొత్త వారిని నియమించనున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు డేవిడ్ అరాఖమియా మంగళవారం తెలిపారు.