Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2, 2025 నుంచి పరస్పర సుంకాలు (Trump Tariff) విధించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ సుంకాలు అమెరికాకు ఎక్కువ వాణిజ్య లోటును కలిగించే దేశాలతో పాటు అన్ని దేశాలపైనా వర్తిస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను అన్యాయమైన ప్రపంచ పోటీ నుంచి కాపాడి, దాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం. ఈ సందర్భంలో భారతదేశం కూడా ప్రభావిత దేశాల జాబితాలో ఉంది. దీనికి సంబంధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మంగళవారం ఒక ప్రకటనలో భారతదేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తోందని పేర్కొన్నారు.
భారతదేశంపై ప్రభావం
భారతదేశం గతంలో అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ట్రంప్ ఈ ప్రయత్నాలతో పూర్తిగా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. కొన్ని నివేదికల ప్రకారం.. భారతదేశం- అమెరికా దిగుమతులపై 23 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా గుర్తించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించనుందని తాను విన్నానని, ఇది ఇతర దేశాల విధానాలను కూడా మెరుగుపరుస్తుందని అన్నారు.
ఈ సుంకాలు అమలులోకి వస్తే భారతదేశ ఫార్మా, కెమికల్, టెక్స్‌టైల్, గార్మెంట్, ఆటో విడిభాగాలు, వ్యవసాయం, ఇంజనీరింగ్, సౌర రంగాలు నష్టపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, అమెరికా ఔషధ దిగుమతులపై సున్నా సుంకం విధిస్తుండగా.. భారతదేశం అమెరికా ఔషధాలపై 10% సుంకం విధిస్తోంది. పరస్పర సుంకాల ప్రకారం.. అమెరికా కూడా 10% సుంకం విధించవచ్చు. ఇది భారత ఔషధ ఎగుమతులను ప్రభావితం చేయొచ్చు.
Also Read: IPL 2025: ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’.. ఎలా పట్టారో చూడండి, వీడియో వైరల్!
ప్రభావిత దేశాలు
ట్రంప్ జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ ప్రకారం.. అమెరికా వాణిజ్య లోటుకు ఎక్కువగా దోహదపడే 10 నుంచి 15 దేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 వాణిజ్య శాఖ డేటా ప్రకార.. చైనా అమెరికాతో అతిపెద్ద వాణిజ్య లోటును కలిగి ఉంది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారతదేశం, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్వీడన్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ట్రంప్ సుంకాల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.\
భారతదేశం చర్యలు
భారతదేశం ఈ సమస్యను పరిష్కరించేందుకు మధ్యస్థ మార్గం కోసం ప్రయత్నిస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి అమెరికాను సందర్శించి చర్చలు జరిపారు. సుంకాల తగ్గింపు ద్వారా ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చే ఈ సుంకాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మొత్తంగా ట్రంప్ వైఖరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాక, భారతదేశం వంటి దేశాలను కూడా కొత్త వాణిజ్య విధానాలను రూపొందించేలా ఒత్తిడి తెస్తుంది.