PCC Chief Mahesh Kumar Goud : నేడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆబిడ్స్ సర్కిల్ వద్ద నెహ్రూ విగ్రహానికి మాజీ ఎంపీ వీహెచ్, తదితరులతో కలిసి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ..ఎల్లుండి నుండి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానన్నారు. మొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడతామన్నారు. 18న మెదక్ పార్లమెంట్ లో నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.
కాగా, లగచర్ల ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్నారు. అంతేకాక దీని వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్ , బీజేపీ లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం రాజకీయాలు, మీ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవన్నారు. మేము తప్పు చేస్తే నిలదీయండి. అంతే కానీ.. అభివృద్ధి నిరోధకులుగా మారవద్దన్నారు. కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏడాది పాలన ఉత్సవాలను ప్రతి కార్యకర్త జరుపుకుంటారన్నారు. పార్టీ పరంగా రేపటి నుంచి విజయోత్సవ కార్యక్రమాలు ఉండనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Read Also: Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు