Site icon HashtagU Telugu

Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ

Full Operational Freedom

Full Operational Freedom

Pahalgam terror attack : జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోడీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. ముష్కరులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.

ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం అని మోడీ అన్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు అని ప్రధాని గట్టిగా హెచ్చరించారు.

కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్‌ చేసి, శిక్షిస్తామని యావత్‌ భారతీయులకు హామీ ఇస్తున్నా. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరు. ఉగ్రవాదానికి శిక్ష తప్పదు అని మోడీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో పాల్గొన్నారు.

Read Also: BRS Party : బీఆర్ఎస్‌ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?