Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.

Published By: HashtagU Telugu Desk
MLC Kavitha Fire

MLC Kavitha Fire

Kavitha: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశామని, అప్పట్లోనే సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ నిర్మాణాన్ని ఆపలేకపోయామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా, తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించడం విపరీతమైన అన్యాయమని మేము అప్పుడే స్పష్టం చేశాం అని పేర్కొన్నారు.

Read Also: Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేతల అత్యవసర భేటీ

ఈ తరహా నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించాయని, 460 మెగావాట్ల లోయర్‌ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడం మరింత బాధాకరమని కవిత అభిప్రాయపడ్డారు. ఇవి అన్ని పార్లమెంటులో లెవెల్లో కూడా మేము ఎత్తిచూపేందుకు ప్రయత్నించాం. కేసీఆర్‌ గారు అప్పట్లో బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్రానికి ఏమాత్రం స్పందన కనిపించలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల ముంపు ప్రభావిత ప్రాంతాలు విస్తరించాయని ఆమె హెచ్చరించారు. ఇది కేవలం నీటి ప్రాజెక్టు సమస్య మాత్రమే కాదు. ఇది మానవీయ సమస్య. వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోతున్నాయి. వారి జీవనాధారాలు నశిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం మానవతా దృష్టితో స్పందించాలి అని ఆమె కోరారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు వంటి గ్రామపంచాయతీలను మళ్లీ తెలంగాణకు కలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించే సమావేశంలో, ఈ గ్రామాలను మళ్లీ తెలంగాణకు చేరుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read Also: Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!

 

  Last Updated: 20 Jun 2025, 03:25 PM IST