Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పా. దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా . తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.
Read Also: Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
కాగా, 2028లోనూ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఎన్నికవుతారని ఆయన అనుయాయి స్టీవ్ బానన్ పేర్కొన్నారు. దీని కోసం మా ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి అని ఆయన వివరించారు. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ ఒక్కరే నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ఇక, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తీ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి వీల్లేదు. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణను మార్చాల్సి ఉంటుంది. దానికి అమెరికా కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి.