Site icon HashtagU Telugu

Bangladesh : దేవుడు అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు :షేక్ హసీనా

That's why God is still protecting me: Sheikh Hasina

That's why God is still protecting me: Sheikh Hasina

Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా సోషల్‌ మీడియా వేదికగా ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ తీవ్ర విమర్శలు చేశారు. యూనస్‌కు ప్రజలంటే ప్రేమ లేదు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి వచ్చారు. ఆ సమయంలో ఆయన తీరును అర్థం చేసుకోలేకపోయాం. అతడికి దేశం ఎంతో సహాయం చేసింది అని అన్నారు. ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంచండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను అని షేక్‌ హసీనా భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ, మీడియాకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో ఈ నేరాలు బయటకు రావడం లేదు అని తాత్కాలిక ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. యూనస్‌ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది. వారి సారథ్యంలో బంగ్లా ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా మారింది. మన నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు ఇలా ఎంతోమందిని లక్ష్యంగా చేసుకున్నారు.

మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడేమో. అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు. నేను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తా అని హసీనా అన్నారు. తన తండ్రి, బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు షేక్‌ ముజిబర్ రెహమాన్ సహా తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తుచేసుకున్నారు. ఒక్క రోజులోనే నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదని షేక్‌ హసీనా అన్నారు.

Read Also:  Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల గుర్రు..?