Alleti Maheshwar Reddy : బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని, త్వరలోనే సీఎం సీటుకు ఎసరు పడబోతున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 7 సార్లు వెళ్లినా ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు తెలంగాణకు కొత్త సీఎం రావచ్చని జోస్యం చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని అదే సమయంలో ఆశావహులు కూడా సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్.. కనీసం ప్రియాంక గాంధీని కలవాలని కేరళలోని వయనాడ్ కు వెళ్లినా దర్శనభాగ్యం కలగలేదన్నారు.
మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదు. నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీన్ని అధిష్టానం కూడా నమ్ముతోందన్నారు. తమకు ఏమీ దొరక్కుండా సీఎం చేస్తున్నారని కొంత మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారని దీనిపై ఢిల్లీలో భేటీ కూడా అయి రేవంత్ ను తొలగించాలని హైకమాండ్ ను కూడా ఒప్పించారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా , మూసీ , ల్యాండ్ సెటిల్ మెంట్లపై హైకమాండ్ వద్ద తేల్చుకునేందుకు సీనియర్ మంత్రులు నివేదికలు పంపారని వారంతా ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కాకుండా హైడ్రా, మూసీని రేవంత్ ఎందుకు ముందుకు వేసుకున్నాడని ఆలోచనలో పడ్డారన్నారు.
ఇకపోతే..పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు మూసీ అంశంపై సోనియా గాంధీ కి నేరుగా వెళ్లి ఇక్కడి పరిస్థితి వివరించి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారన్నారు. రంగంలోకి దిగిన ఆమె.. డీకే శివకుమార్ కు చెప్పి రేవంత్ కు ఫోన్ చేసి కనుక్కోమన్నారు.. డీకే శివకుమార్ ఫోన్ రేవంత్ లిఫ్ట్ కూడా చేయలేదన్నారు. దీన్ని ఆయనే స్వయంగా చిట్ చాట్ లో రేవంత్ ఒప్పుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత లాభం కోసం పార్టీని ఇరికిస్తున్నాడని పార్టీ భయపడుతోందని, కేవీపీ రామచంద్రరావు ఇల్లు కూల్చివేత అంశంపై రేవంత్ చిన్న పిల్లాడిలా మాట్లాడారన్నారు. దీనిపై హైకమాండ్ సీరియస్ గా ఉందని కేవీపీ రామచంద్రరావు ఇప్పటికే దీనిపై బహిరంగ లేఖ కూడా రాశారన్నారు. ఏఐసీసీ కి వస్తున్న ఫిర్యాదులు, గమనిస్తున్న తీరును చూస్తే రేవంత్ కు ప్రత్యామ్నాయం ఎవరు అని పార్టీ ఆలోచిస్తోందన్నారు. అమెరికాలో ఉన్న భట్టి రాగానే హై రైజ్ డ్ బిల్డింగ్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను కూడా రేసులో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారన్నారు. సీఎం కోసం రేసులో ఉన్న ముగ్గురు సీనియర్ మంత్రులు పూస గుచ్చినట్టు ఢిల్లీ పెద్దలకు విషయం వివరిస్తున్నారని చెప్పారు.