PM Modi : గత పదకొండు సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల జీవితాల్లో అపూర్వమైన మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రత్యక్షంగా సేవలు చేరే విధానాన్ని సాంకేతికత వల్ల సాధ్యమయ్యిందని, చివరి లబ్ధిదారుడికి కూడా పథకాలు సమయానుగుణంగా అందుతున్నాయని అన్నారు. ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. అంతర్జాతీయంగా సాంకేతిక శక్తికేంద్రంగా ఎదుగుతున్న భారత్‌కు ఇది మున్ముందు మరింత బలాన్ని ఇస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల్లో ముఖ్యంగా పారదర్శకతకు పెద్దపీట వేసిన విధానాలు, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధానాలే కీలకమని చెప్పారు.
Read Also: BCCI Council Meet: బీసీసీఐ కీలక సమావేశం.. ఇకపై కఠినంగా రూల్స్?
ప్రభుత్వ సేవలను ఖచ్చితంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోందని ప్రధాని మోడీ వివరించారు. పేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు. ప్రధానంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం 56 శాఖల పరిధిలో 322కి పైగా సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ పథకాల ద్వారా రూ.44 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసినట్టు వెల్లడించారు. దీని ఫలితంగా రూ.3.48 లక్షల కోట్ల మేరా వృథా ఖర్చులను నియంత్రించగలిగామని తెలిపారు.
ఇంతటి పెద్ద ప్రయోజనాల వెనక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన విధానం ఉందని మోడీ గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా, ఆధార్ ఆధారిత సేవలు, మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ వంటివి ఈ మార్పుల్లో కీలకమైనదిగా పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించడం అంటే కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అది సమానత్వం, పారదర్శకత, సామర్ధ్యం యొక్క ప్రతీక అని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజా సంక్షేమంలో సాంకేతికత వ్యవస్థాపిత మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: Tollywood : కొలిక్కి రానున్న టాలీవుడ్ సమస్యలు..సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ