Supreme Court : వాహనాలను అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినపుడు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నపుడు బీమా పాలసీ ప్రయోజనాలను పొందలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి బీమా క్లెయిమ్‌లపై పెద్ద ప్రభావం పడే అవకాశముంది. ఈ కేసు 2014 జూన్ 18న కర్ణాటకలో జరిగింది. రవీష్ అనే వ్యక్తి తన కారును అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతను మరణించాడు. రవీష్ కుటుంబ సభ్యులు తరువాత అతని మీద ఉన్న పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.80 లక్షల బీమా పరిహారం కోరి ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించారు.
Read Also: Anganwadi : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
కానీ కంపెనీ ఈ క్లెయిమ్‌ను తిరస్కరించడంతో వారు కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. పోలీసుల విచారణలో దాఖలైన చార్జ్‌షీటులో, రవీష్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందునే ప్రమాదం జరిగిందని స్పష్టంగా పేర్కొనబడింది. అయితే, రవీష్ కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వాదించారు. కానీ కోర్టు రవీష్ నిర్లక్ష్యం స్పష్టంగా తేలిందని తెలిపి, వారి వాదనలను తోసిపుచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కోర్టు తేల్చింది. దీంతో బీమా క్లెయిమ్ అర్హత లేదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసును జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
రవీష్ ప్రమాదానికి గురైనది అతని స్వంత నిర్లక్ష్యం వల్లనేనని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా బీమా క్లెయిమ్ నిరాకరించింది. ఒకవేళ వాహనదారుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురైతే, బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదు. బాధితుడి కుటుంబ సభ్యులు బీమా పాలసీ షరతులను మరియు అర్హతను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ తీర్పు భారతదేశంలో ట్రాఫిక్ బాధ్యతలపై ప్రజలకు స్పష్టతనిస్తుంది. నిర్లక్ష్యం, రూల్ బ్రేకింగ్ వలన జరిగిన ప్రమాదాలకు బీమా కంపెనీలను బాధ్యతవహించాల్సిందేమీ లేదని ఈ తీర్పుతో తేలిపోయింది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలన్న సందేశాన్ని ఈ తీర్పు అందిస్తోంది.
Read Also: Coffee : కాఫీ ఇష్టంగా తాగుతున్నారా? ఆరోగ్యానికి హాని చేసే ఈ విషయాలు మర్చిపోవద్దు!