Prajwal Revanna : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదరయ్యింది. మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. అంతేకాక.. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల కేసుల్లో పలువురు మహిళలకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ద్వారా రేవణ్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రేవణ్ణ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం.. వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వ్యాఖ్యానించింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఇకపోతే..ఈ కేసులో రేవణ్ణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినించారు. రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, అయితే ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రాథమిక ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 కింద ఆయనపై కేసు నమోదుచేయలేదన్నారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసినట్లు రోహత్గీ తెలిపారు. నా క్లయింట్ విదేశాల్లో ఉన్నాడని, అక్కడి నుండి తిరిగి వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా పోటీ చేయగా.. వీటన్నింటి కారణంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు ఆసక్తి చూపడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ త్రివేది పిటిషన్‌ను తిరస్కరించారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడులు, అత్యాచారాలపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.