Shubhanshu Shukla : భారతదేశపు కోట్లాది హృదయాల్లో ఆశల నిప్పులా మెరవుతూ, భారత వాయుసేన ఫైటర్ పైలట్‌గా చక్కటి సేవలందించిన శుభాంశు శుక్లా ఇప్పుడు వ్యోమగామిగా అంతరిక్షాన్ని అధిరోహించారు. అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ‘యాక్సియం-4 మిషన్’లో భాగంగా ఆయన అంతరిక్షానికి ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ ప్రయాణంలో భాగమయ్యారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో (ISS) అనుసంధానమవనుంది. ప్రస్తుతం భూ కక్ష్యలో చుట్టుముట్టే వ్యోమనౌకలో ఉన్న శుభాంశు శుక్లా, అంతరిక్షం నుంచే లైవ్ కాల్‌లో మాట్లాడారు. ఇది ఒక అద్భుతమైన అనుభవం. భార రహిత స్థితిలో ఎలా జీవించాలో చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలపై కొత్తగా అనుభూతులు పొందుతున్నాను అని తెలిపారు. అంతరిక్షంలో కలిసి ప్రయాణిస్తున్న ఇతర అంతర్జాతీయ వ్యోమగాములతో అనుభూతులను పంచుకుంటూ ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అన్నారు.
Watch live as the Ax-4 astronauts check in from orbit https://t.co/nn1GXw6JdQ
— SpaceX (@SpaceX) June 26, 2025
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ మిషన్‌లో వారి వెంట “జాయ్” అనే చిన్న హంస బొమ్మ కూడా ఉందని తెలిపారు. భారత సంప్రదాయంలో హంసను జ్ఞానప్రతీకగా పరిగణిస్తారు. అందుకే దీన్ని మా ప్రయాణంలో భాగం చేశాం అన్నారు. అంతరిక్ష ప్రయాణానికి ముందు 30 రోజుల క్వారంటైన్ పూర్తయిందని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులు గడుపుతూ కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ లైవ్ కాల్ సుమారు 15 నిమిషాలపాటు సాగింది. వ్యోమనౌక అనుసంధానం అనంతరం శాస్త్రీయ ప్రయోగాలు, స్పేస్ వాతావరణ అధ్యయనాలు, భౌతిక శాస్త్ర పరిశోధనలు మొదలవుతాయి. 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు మళ్లీ అంతరిక్షానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతరిక్ష రంగంలో భారత్‌కు ఇది మైలురాయిగా నిలిచే సంధర్భంగా మారింది.