Electoral Bonds SBI : ‘ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలపై మరింత గడువు కావాలి’: సుప్రీంను కోరిన ఎస్‌బీఐ

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 10:36 AM IST

 

Electoral Bonds SBI : ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి సమర్పించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్‌ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్‌ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు(Electoral Bonds) జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు పెట్టిన మూడు వారాల గడువు సమయం సరిపోదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీ ప్రతి దశ ముగింపులో రిడీమ్‌ అయిన బాండ్లను అధీకృత బ్రాంచ్‌లు ముంబైలోని ప్రధాన బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశామని పేర్కొన్నది.

రెండు వేర్వేరు సమాచారాలు ఉన్నందున, మొత్తంగా 44,434 సమాచార సెట్‌లను డీకోడ్‌ చేసి, సరిపోల్చాల్సి ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పథకాన్ని గత నెల 15న కొట్టివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

అదేవిధంగా 2019, ఏప్రిల్‌ 12 నుంచి రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల అన్ని వివరాలను (కొనుగోలు చేసినవారు, కొనుగోలు తేదీ, ఎంత మొత్తం కొనుగోలు చేశారు) మార్చి 6వ తేదీలోగా ఎస్బీఐ.. ఈసీకి సమర్పించాలని, మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఈసీ ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ అమలు సమాచార హక్కు ఉల్లంఘన అవుతుందని, క్విడ్‌ ప్రోకోకు దారితీసే ప్రమాదమూ ఉన్నదని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నల్లధనాన్ని కట్టడికి ఇదొక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఈసీ సమర్పించేందుకు గడువు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని విపక్ష నేతలు వ్యతిరేకించారు. ఇది ప్రధాని మోదీ ‘నిజ రూపాన్ని’ దాచేందుకు లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేస్తున్న చివరి ప్రయత్నమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘విరాళాల వ్యాపారాన్ని’ దాచిపెట్టేందుకు మోదీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ తన ఎక్స్‌ పోస్టులో ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను తెలుసుకోవడం ప్రజల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, అయితే ఎన్నికలకు ముందు ఎస్బీఐ ఈ వివరాలను బహిరంగపరిచేందుకు ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. ‘వారి అవినీతిని దాచేందుకు దేశంలోని ప్రతి స్వతంత్ర సంస్థ ‘మోదానీ’ ఫ్యామిలీలో భాగంగా మారింది’ అని రాహుల్‌ ఆరోపించారు.

read slao : Abortion Right : అబార్షన్‌ ఇక మహిళల రాజ్యాంగ హక్కు

మరోవైపు ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనుమానాలను పెంచుతున్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ చర్య న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ‘క్విడ్‌ప్రోకో’ బయటపడకుండా ప్రధాని మోడీ, బీజేపీని కాపాడేందుకే ఎస్బీఐ లోక్‌సభ ఎన్నికల తర్వాతి వరకు గడువు కోరిందని ఆరోపించారు. నేటి డిజిటల్‌ కాలంలో సమాచారం అంతా ‘మౌస్‌ క్లిక్‌’ దూరంలో ఉంటుందని, అయితే ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల సమర్పణకు గడువు పొడిగింపు కోరడం అనుమానాలకు తావిస్తున్నదని ఏచూరి అన్నారు.