Site icon HashtagU Telugu

Plain Crash : కజకిస్థాన్‌ ప్రమాదం ఘటన.. రష్యా అధ్యక్షుడు క్షమాపణలు

Russian President apologizes for Kazakhstan plane crash

Russian President apologizes for Kazakhstan plane crash

Plain Crash : ఇటీవల కజకిస్థాన్‌లో ప్రయాణికుల విమానం కూలి 38 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ స్పందించారు. జే2-8243 విమానం కోల్పోయి 38 మంది మృతిచెందడం, మరో 29 మంది గాయపడటంతో ఆయన అజర్‌ బైజాన్‌ కు క్షమాపణలు చెప్పారు. అజర్‌ బైజాన్‌ దేశాధినేత తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అజర్‌ బైజాన్‌ లోని బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా కజఖిస్థాన్‌ లో ఆ విమానంలో కూలిపోయింది.

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు రష్యా క్షిపణులను ప్రయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అందులో ఒక క్షిపణి తగలడంతోనే విమానం కూలిపోయిందని అజర్‌ బైజాన్‌ తో పాటు ఉక్రెయిన్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలపై పుతిన్‌ స్పందిస్తూ.. తమను అజర్‌ బైజాన్‌ అధినేత ఇల్హామ్‌ అలియేవ్‌ క్షమించాలని కోరారు. దీంతో విమాన ప్రమాదానికి తమ క్షిపణులే కారణమని పుతిన్‌ ఒప్పుకున్నట్టు అయ్యింది. రష్యా గగనతలంలో సంభవించిన ఈ విషాద ఘటనకు పుతిన్‌ క్షమాపణలు చెబుతూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ, హృదయపూర్వక సానుభుతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ ఆకాంక్షించారు.

కాగా, అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం కూలి 38 మంది మృతి చెందడంపై పలు ఊహాగానాలు జరుగుతున్నాయి. ఓ పక్షి లేదా పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల, విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని రష్యా విమానయాన శాఖ ప్రకటించింది. కానీ విమానంపై కాల్పుల గుర్తులు కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. కజకిస్థాన్‌లో విమానం కూలిన ఆక్టావ్‌ నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా గగనతల రక్షణ వ్యవస్థ గస్తీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ డ్రోన్లు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల విమానాన్ని కూడా డ్రోన్‌గా పొరబడి, ఆటోమేటిక్‌గా పాంట్సిర్‌-ఎస్‌ అనే స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివేట్‌ అయి విమానాన్ని కూల్చినట్లు సాంకేతిక అవగాహన ఉన్న కొన్ని సంస్థలు తెలిపాయి.

Read Also: Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాం – నారా లోకేశ్