Site icon HashtagU Telugu

Russia- Ukrain : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి

Russia strikes Ukraine with missiles and drones, killing 14 people

Russia strikes Ukraine with missiles and drones, killing 14 people

Russia- Ukrain : ఇప్పటికే ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో సతమతమవుతుండగా, మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రమవుతోంది. తాజాగా రష్యా తన వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను వణికించింది. కీవ్‌ నగరంతోపాటు పలు ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుని మాస్కో సైన్యం భారీ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కీవ్‌ సైనిక పరిపాలన అధిపతి తైమూర్ ట్కాచెంకో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో నగరంలోని డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉండవచ్చన్న అంచనాల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారుల అభిప్రాయం.

Read Also: Air India Plane Crash: ఇంటికి చేరిన సుమీత్ సబర్వాల్‌‌ మృతదేహం..

ఘటనా స్థలాల్లో అత్యవసర సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడుల్లో ఓ అమెరికా పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించబడింది. రష్యా ప్రయోగించిన అనేక డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు నిలువరించినప్పటికీ, వాటి శిథిలాలు కీవ్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పడడంతో భారీ మంటలు చెలరేగాయి. ఇక, ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న ‘‘జీ7 సదస్సు’’కు హాజరుకావడానికి సన్నద్ధమవుతున్నారు. అక్కడ యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ మద్దతు అంశాలపై చర్చలు జరగనున్నాయి. జెలెన్‌స్కీ, రష్యా వైఖరిని ఖండిస్తూ అమెరికా సహా పశ్చిమదేశాలను తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రష్యాపై ఒత్తిడి పెంచితేనే యుద్ధం ఆగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల ఉక్రెయిన్‌పై జరిగిన ఈ వైమానిక దాడి గత మూడేళ్లలో అతిపెద్దదిగా గుర్తించబడింది. మొత్తం 367 డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించిన రష్యా, 69 క్షిపణులు, 298 డ్రోన్లు ఉక్రెయిన్‌పై వదిలినట్లు సమాచారం. ఈ దాడుల్లో 80 నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ డ్రోన్లలో చాలా వరకు ఇరాన్ తయారీ షాహెద్ మోడళ్లని అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధం మానేయాలని పిలుపు ఇవ్వడంతోపాటు, ఉక్రెయిన్‌పై వరుస దాడులకు పాల్పడుతున్న రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని జెలెన్‌స్కీ అన్నారు.

Read Also: Mahesh Kumar Goud : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు