Site icon HashtagU Telugu

MD Sajjanar : దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు : ఎండీ సజ్జనార్

RTC ticket charges not increased for Dussehra festival: MD Sajjanar

RTC ticket charges not increased for Dussehra festival: MD Sajjanar

TGSRTC Ticket Prices : బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించినట్లు చెప్పారు. అంతేకానీ రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని.. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుందని పేర్కొన్నారు. రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుందని.. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయని తెలిపారు. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని స్పష్టం చేశారు. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని పోస్ట్ లో పేర్కొన్నారు.

Read Also: Chirag Paswan : కేంద్ర మంత్రికి ‘జడ్’ కేటగిరి భద్రత

దీంతో పాటు ఎండీ సజ్జనార్ మహాలక్ష్మి పథకం గురించి కూడా వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం మేర రద్దీ పెరిగిందని.. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, తదితర పండుగలకు బస్సుల్లో ప్రయాణాలు పెరిగాయని పేర్కొన్నారు. “ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగుల్లో నడిచే స్పెషల్ బస్సులకు చార్జీలను జీవో ప్రకారం సవరించడం జరుగుతోంది. టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా రోజూ సగటున 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతుంది. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీల సవరణ ఉంటుంది. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.” అని స్పష్టం చేశారు.

పండుగ సమయాల్లో రెగ్యులర్ , స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో తేడాలుండటం సాధారణమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. “ఉదాహరణకు ఒక ప్రయాణికుడు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సర్వీసుల్లో ప్రయాణిస్తే సాధారణ టికెట్ ధరనే ఉంటుంది. తిరుగుప్రయాణంలో స్పెషల్ బస్సును వినియోగించుకుంటే జీవో ప్రకారం సవరణ ఛార్జీలుంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేయడం జరుగుతుంది. పండగ సమయాల్లో మాత్రమే జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయి. స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది.” అని పూర్తి వివరాలను ఎక్స్ ద్వారా ప్రజానికానికి తెలియజేశారు.

Read Also: Ratan Tata : మహారాష్ట్ర స్కిల్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు..