AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏడుగురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన మోసగాళ్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసి రూ.53 లక్షల మోసం చేసిన ఈ ముఠాలో నలుగురు సభ్యులను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్‌నగర్‌కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Read Also: Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
విజయవాడ సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి రూ.53 లక్షలు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్‌మెంట్ లేఖలు తయారు చేసి వారికిచ్చాడు. బాధితులను విజయవాడకు తీసుకువచ్చి నెలరోజులపాటు అక్కడే ఉంచి, త్వరలోనే ఉద్యోగ సమాచారం ఇస్తామని చెప్పి చివరికి మోసగాళ్లు అప్రతమయ్యారు. ఎంతకీ సమాచారం రాకపోవడంతో ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్ అనే యువకుడు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, నలుగురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు అయిన విషయం తెలిసిన వెంటనే నిందితులు పరారయ్యారు. అయితే ప్రధాన నిందితుడైన సుజిత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, అతన్ని చూసేందుకు మిగిలిన ముగ్గురు సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్ విజయనగరానికి వస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద పక్కా ఏర్పాట్లు చేసి వారిని పట్టుకున్నారు.
విచారణలో, హైదరాబాద్‌లోనే నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్లు నిందితులు అంగీకరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సుజిత్ ఆరోగ్యం కుదిరిన వెంటనే అతనిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ కేసు ఛేదించిన పోలీసుల నిపుణతను డీఎస్పీ కొనియాడారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన నిరుద్యోగులు మోసపోవడాన్ని ఎంత క్షమించలేనిది చేస్తుందో, అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు వాగ్దానాలపై ఎంత జాగ్రత్తగా ఉండాలో స్పష్టంగా చూపిస్తుంది.
Read Also: Chhattisgarh : మరోసారి ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి