TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి కీలక పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల విస్తరణతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ అనేక ప్రగతిశీల కార్యక్రమాలను చేపట్టింది. మంగళవారం తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించగా, చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభలో ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్‌లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Read Also: CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బెంగళూరులో పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న ఆలయం చిన్నదిగా ఉందని, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఆలయం నిర్మించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచించారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. స్థలం కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు తిరుమలలో త్వరలోనే ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని హామీ ఇచ్చినట్టు బీఆర్ నాయుడు తెలిపారు. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత, తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది.
తీర్థప్రసాదాల నాణ్యతను కాపాడేందుకు తిరుమలలో ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. నీరు, నెయ్యి, పప్పుదినుసులు వంటి వస్తువుల నాణ్యతను పరీక్షించే ఈ ల్యాబ్ నిర్మాణానికి లీజు పద్ధతిలో స్థలం కేటాయించనున్నారు. టీటీడీ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. “మన వారసత్వం” అనే పేరుతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తెలుగు సంస్కృతి, సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు వరలక్ష్మీ వ్రతం రోజున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో “సౌభాగ్యం” పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొనే వీలుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ విధంగా టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయాలు శ్రీవారి భక్తులకు మరింత ఆనందాన్ని, సౌకర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. భక్తి, సేవా, సంస్కృతి సమన్వయంతో టీటీడీ అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకెళ్తోంది.
Read Also: Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత