CM Revanth Reddy : రాష్ట్రంలోని వైద్య విద్యా రంగాన్ని మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పనిచేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవల జాతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కౌన్సిల్ – NMC) రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలల్లో వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, దీనిపై వివరణ కోరడాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం, తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 18న ఢిల్లీకి హాజరై వివరాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)లను ఎన్‌ఎంసీ ఆదేశించింది. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్ రూపంలో ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు.
Read Also: PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు
ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం ప్రతి కళాశాలలో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను నియమించాలని అధికారులను ఆదేశించారు. మూడు సంవత్సరాల్లో అన్ని అవసరమైన వసతులు పూర్తి కావాలని, ఇందుకోసం ప్రభుత్వమే నిధులను విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్ధులు, ఫ్యాకల్టీ, పేషెంట్ కేర్ ఈ మూడు అంశాల్లో రాజీ పడకూడదు. వసతులు మెరుగ్గా ఉండాలంటే ఫీల్డ్ విజిట్లు, ప్రణాళిక, అమలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలను సమీకరించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలుసుకుని పరిష్కరించేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రం సహకారంతో మెడికల్ ఎడ్యుకేషన్ రంగాన్ని దేశంలో ఉత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, నర్సింగ్ విద్యాభ్యాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఐచ్ఛికంగా బోధించాలన్న ప్రతిపాదనను సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది. భాషా నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి అని చెప్పారు. ప్రతి నెల మూడో వారంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖలపై సమీక్షలు నిర్వహించాలని సూచిస్తూ, శాఖల మధ్య సమన్వయం పెంచాలని అన్నారు. అనంతరం జరిగిన మంత్రి మండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా, తదితర ప్రజాప్రయోజన అంశాలపై చర్చించారని సమాచారం.