Prisoners Exchange : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, రెండుదేశాల మధ్య నిరంతరంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధంలో బందీలుగా చిక్కిన ఖైదీలను రష్యా మరియు ఉక్రెయిన్ పరస్పరంగా విడుదల చేశాయి. ఈ ఖైదీల మార్పిడిని తాజాగా ఇస్తాంబుల్‌లో జరిగిన రెండవ దశ చర్చల ఫలితంగా భావిస్తున్నారు. ఈ చర్చల అనంతరం రష్యా రక్షణ శాఖ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఖైదీలను విడుదల చేసి బెలారస్‌కి తరలించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బందీలకు ముందుగా బెలారస్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు రష్యా ప్రకటించింది. అనంతరం వారిని మాస్కోలోని వైద్య కేంద్రాలకు తరలించనున్నట్లు వెల్లడించింది. అయితే, ఖచ్చితంగా ఎంతమంది ఖైదీలు విడుదలైనారన్న విషయాన్ని మాత్రం రష్యా ఇంకా వెల్లడించలేదు.
Read Also: Premalu 2 : ప్రేమలు 2 ఆగిపోయిందంటగా..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఖైదీల మార్పిడిని ధ్రువీకరించారు. ఈ మార్పిడి ముఖ్యంగా యుద్ధంలో తీవ్రంగా గాయపడినవారు, 25 ఏళ్లలోపు యువ ఖైదీలకు ప్రాధాన్యత ఇచ్చేలా జరిగిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరు దేశాలు ఈ మార్పిడికి ముందే ఒక అవగాహన ఒప్పందాన్ని ఇస్తాంబుల్‌లో కుదుర్చుకున్న విషయం విదితమే. ఇక, మరో కీలక అంశంగా, రెండు దేశాలు సుమారు 6,000 మృత సైనికుల శవాలను పరస్పరం అప్పగించేందుకు కూడా అంగీకరించాయి. ఇందులో భాగంగా రష్యా 1,212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను ఉక్రెయిన్‌కు పంపిందని తెలిపింది. అయితే ఈ ప్రక్రియను ఉక్రెయిన్ అర్ధాంతరంగా నిలిపివేసిందని మాస్కో ఆరోపించింది. దీనిపై స్పందించిన కీవ్ ప్రభుత్వం మాత్రం రష్యా “డర్టీ గేమ్స్” ఆడుతోందని విమర్శించింది. మృతదేహాల తరలింపుపై స్పష్టమైన తేదీ నిర్ణయించబడలేదని పేర్కొంది.
మరోవైపు, రష్యా తమ దాడులను మళ్లీ ముమ్మరం చేసింది. మంగళవారం రోజు రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన తీర ప్రాంతమైన ఒడెసాపై గాఢమైన దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఇది గత మూడేళ్లలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇక ఇటీవల ఉక్రెయిన్ “స్పైడర్ వెబ్” పేరుతో ఓ భారీ ఆపరేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ రష్యా వ్యూహాలను సవ్యంగా ఛేదించాలనే లక్ష్యంతో నడుపుతున్నదిగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు బందీల మార్పిడి, మృతదేహాల అప్పగింత వంటి చర్యలు జరిగిపోతున్నాయి. అయితే దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో శాశ్వత శాంతికి మార్గం కనిపించాలంటే ఇరు దేశాలకూ మరింత చిత్తశుద్ధి అవసరం.