Primitives In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీ హిల్స్ .. భారీ బిల్డింగ్ లు ఉండే చోటు, భారీ నెట్ వర్త్ కలిగిన ఫ్యామిలీస్ నివసించే కాస్ట్లీ చోటు !!
మన రాష్ట్రంలోనే కాస్ట్లీ ఏరియాగా అది సుపరిచితం!!
కొండలు, గుట్టలపై ఏర్పడిన జూబ్లీ హిల్స్ ఏరియాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగుచూసింది.
వేల ఏళ్ళ కిందట జూబ్లీ హిల్స్ లోనూ ఆది మానవులు(Primitives In Jubilee Hills) నివసించారని పురావస్తు పరిశోధకులు గుర్తించారు. దీన్నిబట్టి హైదరాబాద్ కు 6 వేల ఏళ్ల చరిత్ర ఉందని వెల్లడించారు. కొత్త రాతియుగం నాటి ఆనవాళ్లను జూబ్లీహిల్స్ పరిధిలోని బీఎన్ఆర్ హిల్స్ వద్ద తాబేలు గుండు కింద గుర్తించారు. ఈవిషయాన్ని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా ఈ రీసెర్చ్ టీమ్ శనివారం తాబేలు గుండును పరిశోధించగా .. దాని కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు బయటపడ్డాయి. చూడటానికి అవి మామూలు రాళ్లలాగానే ఉన్నాయి. కానీ మొనతేలి ఉన్నాయి. ఆది మానవులు ఆహారం కోసం.. ఆయుధాలుగా ఆ రాళ్లను వాడుకున్నారని అర్థమవుతోంది. జూబ్లీహిల్స్ లో జీవించిన ఆది మానవులు వ్యవసాయం చేసేవాళ్లు, పశువుల్ని కూడా పెంచుకునే వాళ్లని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తాబేలు గుండు అనేది దాదాపు 20 మంది ఆది మానవులకు (Primitives In Jubilee Hills) తాత్కాలిక ఆవాసంగా ఉపయోగపడి ఉండొచ్చని అంటున్నారు. తాబేలు గుండు కింద దొరికిన రాతి గొడ్డళ్లు పాత రాతియుగపు గొడ్డళ్ల కంటే ఆధునికంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో పెద్దది 12 సెంటీమీటర్ల పొడవు, 7.2 సెంటీమీటర్ల వెడల్పు ఉంది.