Jyoti Malhotra: కేరళ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంబంధాలున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ‘‘ట్రావెల్ విత్ జో’’అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె గతంలో పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు అక్కడి హైకమిషన్ ఉద్యోగి డానిష్ పరిచయమై, ఆ తర్వాత పాక్ గూఢచారి సంస్థలతో సంబంధాలు కొనసాగించినట్టు అధికారులు వెల్లడించారు. ఆమె కేరళలోని కన్నూర్ ప్రాంతంలో పర్యటించగా, ఆ పర్యటనకు రాష్ట్ర పర్యాటక శాఖ స్పాన్సర్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ తీవ్ర విమర్శలు చేశారు. పినరయి విజయన్ అల్లుడు, పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతికి స్వాగతం పలకడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? పాక్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్న ఒకరికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసేలా ప్రవర్తించడమేమిటి? అంటూ ఎక్స్ లో ప్రశ్నించారు.
Read Also: Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో రూ.1.20 కోట్లు మాయం..
జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్థాన్ పర్యటనలో పాల్గొన్నపుడు అక్కడి గూఢచారి వ్యవస్థతో సంబంధాల్ని ఏర్పరచుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో ఆమె డానిష్‌తో టచ్‌లోకి వెళ్లిందని, ఆ తర్వాత కూడా సంప్రదింపులు కొనసాగించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంలోనూ ఆమె డానిష్‌తో మాట్లాడిన రికార్డులు లభ్యమైనట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే విచారణలో ఆమెకు ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆమె జాగ్రత్తగా, పూర్తి స్పృహతో పాకిస్థానీ నిఘా సంస్థలతో సంబంధాలు కొనసాగించిందన్న అనుమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, పాక్ గూఢచారి సంస్థలకు భారతీయ మొబైల్ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో కాసిమ్ అనే వ్యక్తి ఇటీవల అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో కాసిమ్ పాక్‌లో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇక్కడికి తిరిగి రావడం నా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇక్కడి ప్రేమ, ఆత్మీయతే నన్ను మళ్లీ వచ్చేలా చేసింది అని చెప్పిన విషయం అధికారులు ధ్రువీకరించారు. కాగా, కాసిమ్ సోదరుడు హసిన్‌ను కూడా పాకిస్తాన్‌తో గూఢచర్యం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. దేశ భద్రతకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని విదేశీ సంస్థలకు ఇవ్వడంపై కేంద్రం తీవ్రమైన దృష్టిసారించిందని విశ్వసనీయ సమాచారం.
Read Also: TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం