PM Modi mourns Sitaram Yechury death: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ‘ఎక్స్’లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్గా తనదైన ముద్ర వేశారన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రధాని మోడీ ప్రకటించారు.
నా చిరకాల మిత్రుడు ఏచూరి..మమ్ముట్టి
మరోవైపు సీతారాం ఏచూరి మృతి పట్ల మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. మమ్ముట్టి తన ప్రియ మిత్రుడి మృతికి చింతిస్తున్నానని, మంచి వ్యక్తిత్వానికి వ్యక్తిని కోల్పోయానని ఫేస్‌బుక్‌లో రాశారు. “నా చిరకాల మిత్రుడు సీతారాం ఏచూరి ఇప్పుడు మన మధ్య లేరన్న విషయం విని బాధపడ్డాను. తెలివైన రాజకీయ నాయకుడు, అద్భుతమైన వ్యక్తి మరియు నన్ను బాగా అర్థం చేసుకునే స్నేహితుడు. ఏచూరిని ఎప్పటికీ మరచిపోలేను’ అని మమ్ముట్టి అన్నారు.
ఉద్యమ పంథాను అనుసరించిన నాయకుడే..
కాగా, సీతారాం ఏచూరి.. తెలుగు వారికే కాదు, జాతీయ రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎర్ర జెండా పట్టుకుని ఎన్నో ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించిన నాయకుడు ఆయన. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏచూరి కొద్ది కాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉంటూనే ఇతర రాజకీయ పక్షాలకు కూడా ఒక థింక్ ట్యాంక్‌లాగా కనిపించడం ఒక్క సీతారాం ఏచూరికే సాధ్యమైందని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఎర్ర జెండాను నమ్ముకున్న యువతరానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఉద్యమ పంథాను అనుసరించిన నాయకుడే అయినప్పటికీ, గొంతు చించుకుని అటెన్షన్ గ్రాబ్ చేసే లక్షణాన్ని ఆయన ఏనాడూ ప్రదర్శించలేదు. సౌమ్యంగా మాట్లాడుతూనే నిక్కచ్చిగా ఆలోచనలు పంచుకోగలగడం ఆయన ప్రత్యేకత. దాదాపు అర్థ శతాబ్దం పాటు కమ్యూనిస్టు వర్గాలలోనే కాదు, దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపిన రాజకీయవేత్తే సీతారాం ఏచూరి.
Read Also: Baby Care : పాలల్లో పంచదార వేసి పిల్లలకు ఇస్తున్నారా.? మంచిదేనా..?