PM Modi launched six vande bharat trains: ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ లో ఆరు కొత్త వందేభారత్ రైళ్ల ను వర్చువల్ విధానంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. దేశంలో రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం వల్లే అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. గతం కంటే రైల్వే ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.
Read Also:Megha Akash : ఘనంగా హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి..
కాగా, మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ – పాట్నా, భాగల్పూర్ – దుమ్కా – హౌరా, బ్రహ్మపూర్ – టాటానగర్, గయా – హౌరా, డియోఘర్ – వారణాసి మరియు రూర్కెలా – హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైళ్లు అత్యధికంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 120 ట్రిప్పుల ద్వారా వందే భారత్ రైళ్లు రోజూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొంది. ప్రధాని మోడీ వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని జాతికి అంకితం చేశారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ లబ్ధిదారుల కోసం రూ.660 కోట్ల నిధులు 20,000 మందికి మంజూరు చేశారు.
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కర్మ పూజపై జార్ఖండ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ కోసం కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. జార్ఖండ్‌లో ఆధునిక సౌకర్యాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇంతకుముందు అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, ఇప్పుడు దేశంలోని పేదలు, గిరిజనులకే ప్రాధాన్యత ఉందని ప్రధాని మోడీ అన్నారు. దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేడు పేదలు నేరుగా పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని మోడీ అన్నారు. రైలు కనెక్టివిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.