Rich Orphan Vs War For Adoption : నాలుగేళ్ల ఆ అనాథ బాలుడి పేరిట రూ.27 కోట్ల ఆస్తి ఉంది..
దీంతో ఆ పిల్లాడిని తమకంటే తమకు దత్తత ఇవ్వాలంటూ బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు, దూరపు బంధువులు క్యూ కట్టారు.
ఏకంగా కోర్టులో కేసులు వేశారు..
ఇంతకీ ఎవరా బాలుడు ? అతడికి అంత డబ్బు ఎక్కడిది ? దత్తత కోసం ఎందుకీ క్యూ లైన్లు ?
Also read : Rahul Gandhi: రాహుల్ జోడో యాత్రపై జైన్ ముని వీడియో వైరల్
2022 జులై 4 నాటి ముచ్చట ఇది.. ఆ బాలుడి పేరు ఈడెన్ మెక్‌కార్తీ .. వయసు 3 సంవత్సరాలు.. తన పేరెంట్స్ తో కలిసి అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉన్న హైలాండ్ పార్క్‌లో సరదాగా తిరిగేందుకు వెళ్ళాడు. ఆ టైంలో రాబర్ట్ క్రిమో అనే ఒక సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పార్కులో ఉన్నఏడుగురు చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో బాలుడు ఈడెన్ మెక్‌కార్తీ పేరెంట్స్ కూడా ఉన్నారు. బుల్లెట్లు బాడీలోకి దూసుకెళ్లడంతో అతడి అమ్మానాన్న అక్కడికక్కడే చనిపోయారు. దీంతో మెక్‌కార్తీ ఏడుస్తూ అక్కడే తిరగసాగాడు.. ఆ అబ్బాయిని పోలీసు అధికారులు అక్కున చేర్చుకొని .. అతడి అమ్మమ్మ (62 ఏళ్ళు), తాతయ్య (66 ఏళ్లు)కి అప్పగించారు. ఆ సమయంలో (గత ఏడాది ఆగస్టులో) ఒక వ్యక్తి చొరవ చూపి.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు ఈడెన్ మెక్‌కార్తీకి సాయం చేయాలని దాతలను కోరాడు. దీంతో రూ.27 కోట్ల విరాళాలు వచ్చాయి. అప్పటివరకు మెక్‌కార్తీ గురించి అతడి బంధువులు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఈ 27 కోట్లు వచ్చిన తర్వాత మెక్‌కార్తీ బంధువుల ఆలోచనలో మార్పు వచ్చింది. మెక్‌కార్తీని వయసు మీద పడిన అతడి అమ్మమ్మ, తాతయ్య సరిగ్గా చూసుకోలేరని.. తామైతే బాగా చూసుకుంటామని వాదిస్తూ బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు కోర్టులో దత్తత పిటిషన్లు(Rich Orphan Vs War For Adoption) వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మెక్‌కార్తీ ఇప్పటికైతే తన అమ్మమ్మ, తాతయ్య దగ్గరే ఉన్నాడు. అయితే తమ దగ్గరే ఉంటామని కోర్టులో చెప్పాలంటూ అతడిని కొంతమంది బంధువులు భయపెడుతున్నారని కోర్టు దృష్టికి అమ్మమ్మ, తాతయ్య తీసుకెళ్లారు. దీంతో వారి ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. మొత్తానికి తల్లిదండ్రులను ప్రమాదవశాత్తు కోల్పోయిన ఆ బాలుడి దగ్గరున్న సంపద.. బంధువులను అతడి వైపు అయస్కాంతంలా లాగుతోందని చెప్పడంలో సందేహం లేదు.