Supreme Court : సుప్రీం కోర్టులో పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గువాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నోటీసులు జారీ చేసింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు కోరారు.
ఈ అంశంపై ఏవైనా చర్యలు తీసుకోవాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్నింటిని అమలుచేస్తామని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఇక, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దేశంలో నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాక.. విచారణ సమయంలో పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారు. ఇలాంటి లైంగిక అసభ్యకరమైన కంటెంట్ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా కలుషితమవుతాయని పేర్కొంది.
ఈ చర్యలు, డిజిటల్ మీడియా సురక్షితతను పెంచడానికి, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, మరియు నేరపూరిత కంటెంట్‌ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల భాగంగా ఉన్నాయి. మరోవైపు ఈ విషయంపై జస్టిస్ బీఆర్ గువాయ్ స్పందిస్తూ.. ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయన్నారు.
Read Also: Mahesh Kumar Goud : తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది ఆయనే : మహేశ్‌కుమార్ గౌడ్