TG High Court : తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణలో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని హైకోర్టు మరోసారి తెలిపింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: Shivangi Trailer : ఆనంది ‘శివంగి’ ట్రైలర్ రిలీజ్.. సత్యభామ రా..సవాల్ చేయకు..చంపేస్త..
ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా, పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది. ఈక్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకు హైకోర్టు విధించిన అంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ 16ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది.