BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త నాయకుడు లభించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. ఆయన రామచందర్‌రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Read Also: Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్ స్టోరీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర కాలంలోనే ప్రజల నిరాశకు గురైందని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌పై కాకుండా బీజేపీపై ఆశలు పెట్టుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు రామచందర్ రావును ఘనంగా సత్కరించారు. పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ..తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ATM సర్కార్లు పనిచేస్తున్నాయని, అవి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నాయనీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే ప్రజలకు చేరాలన్నా, అవి ప్రజల దృష్టికి రాకుండా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నేతలంతా ప్రజల మధ్యకి వెళ్లి కేంద్ర పథకాల గురించి వివరించాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరికి మోదీ ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలియజేయాలి. అప్పుడు ప్రజలు నిజమైన అభివృద్ధిని గ్రహిస్తారు అని అన్నారు. ఎన్. రామచందర్ రావు బీజేపీ వర్గంలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకి న్యాయపరమైన పరిపక్వతతో పాటు ప్రజలతో నేరుగా మమేకమయ్యే శక్తి ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో కొత్త దిశగా ప్రయాణించనుంది.