Sex Vs Minimum Age : “మినిమమ్ ఏజ్ ఎలిజిబిలిటీ”.. ప్రతిదానికీ ఉంటుంది. సెక్స్ చేయడానికి కూడా !!
మనదేశంలో పరస్పర ఇష్టంతో శృంగారంలో పాల్గొనడానికి కనీస వయసు ప్రస్తుతం 18 ఏళ్లు.
అయితే దీన్ని రెండేళ్లు తగ్గించి.. 16 ఏళ్లు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మనదేశ సంస్కృతికి విరుద్ధమైన పరిణామమే అయినప్పటికీ.. ఇటీవలకాలంలో పరస్పర ఇష్టంతో మైనర్లు శృంగారంలో పాల్గొనే ఘటనలు పెరిగాయనేది చేదు నిజం.
సినిమాలు, సీరియళ్లలోని అశ్లీల సీన్ లు.. పోర్న్ వెబ్ సైట్ లలోని వీడియోలు.. ఓటీటీలలోని అసభ్య డాక్యుమెంటరీల ప్రభావం ఈతరాన్ని గాడి తప్పిస్తోంది.
కనీసం టీనేజీ అయినా దాటకముందే.. సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి లవ్వేజీలోకి అడుగు పెట్టేలా టెంప్ట్ చేస్తోంది.
Also read : INS Kirpan: భారత్ కు 32 ఏళ్లపాటు సేవలందించిన యుద్ధనౌకను వియత్నాంకు బహుమతిగా ఇచ్చిన ఇండియా..!
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
జూన్ 27న మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే పెద్దరికం వస్తోంది. బాలికలు 14 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారు. కిశోరప్రాయంలోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారు. ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో పరస్పర ఇష్టంతో శృంగారం చేసుకునే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలి. నిజానికి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)కి సవరణ చేయక ముందు ఈ వయసు 16 ఏళ్లుగానే ఉండేది. దీన్ని పునరుద్ధరించడం ద్వారా బాలురకు అన్యాయం జరగకుండా కాపాడొచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
పోక్సో కేసుల విచారణ వన్ సైడ్..
16 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సు గల మైనర్లు ఇళ్ల నుంచి పారిపోయిన ఘటనలు లేదా ఏకాభిప్రాయంతో వారు లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు రెండు కుటుంబాల పెద్దలకు తెలిశాక.. ఫిర్యాదు అనేది కేవలం బాలిక తరఫు వారి నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. ఆ బాలికతో కలిసి పారిపోయిన లేదా లైంగిక కార్యకలాపంలో పాల్గొన్న మైనర్ బాలుడిపై మాత్రమే పోక్సో చట్టం కింద కేసు నమోదు అవుతోంది. ఈక్రమంలో వారి మధ్య శృంగార ‘సమ్మతి’ కుదిరిందా.. లేదా ? బాలుడి వయసు ఎంత ? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేవలం బాధితురాలి కోణంలోనే ఈ తరహా పోక్సో కేసుల విచారణ సాగుతోంది. ఎందుకంటే చట్టప్రకారం..18 ఏళ్లలోపు బాలికతో శృంగారంలో పాల్గొనడం అనేది లైంగిక దాడితో ముడిపడిన నేరం కిందికి వస్తుంది. ఇలాంటి కేసులలో మైనర్ బాలుడిని దోషిగా నిర్ధారించనప్పటికీ.. బెయిల్ దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ఒకవేళ నేరం నిర్ధారణ అయితే సుదీర్ఘ జైలు శిక్షలు పడుతున్నాయి. 2012లో తీసుకొచ్చిన పోక్సో చట్టం వల్ల శృంగార ‘సమ్మతి’ వయసు 16 నుంచి 18 సంవత్సరాలకు(Sex Vs Minimum Age) పెరిగింది. వాస్తవానికి 1949 నుంచి 2012 వరకు.. అంటే 63 ఏళ్లపాటు మనదేశంలో శృంగార ‘సమ్మతి’ వయసు 16 ఏళ్లుగానే ఉండేది.
Also read : Korean Open-India Win : రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి తడాఖా.. “కొరియా ఓపెన్” ఇండియా కైవసం
సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారు ?
“మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా శృంగార ‘సమ్మతి’ వయసుపై పునస్సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై పార్లమెంటు దృష్టి పెట్టాలి” అని 2022 డిసెంబర్ 10న ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. “పోక్సో కేసుల విచారణ కేవలం బాధితురాలి కోణంలోనే జరుగుతున్నాయి. ఈక్రమంలో శృంగారంలో పాల్గొన్న ఇద్దరి మధ్య కుదిరిన ‘సమ్మతి’, నిందితుడి వయసు వంటి అంశాలపై దృష్టిపడటం లేదు. దీనిపై ఆందోళన రేకెత్తుతున్న వేళ శృంగార ‘సమ్మతి’ వయసుపై మరోసారి చర్చ జరిగితే బాగుంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది.. ?
శృంగార ‘సమ్మతి’ వయసు తగ్గింపు విషయమై కేంద్ర ప్రభుత్వం 2022 డిసెంబరు 26న కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల వయసును తగ్గించే ఆలోచన లేదని పార్లమెంటుకు కేంద్ర సర్కారు తెలిపింది. రాజ్యసభలో సీపీఐ ఎంపీ బినయ్ విశ్వం అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Also read : Tomatoes Hijacking: రైతును బెదిరించి టమాటా ట్రక్కును హైజాక్ చేసిన దంపతులు.. పోలీసులు అదుపులో నిందితులు..!
త్వరలో లా కమిషన్ నివేదిక.. ఏముంది ?
ప్రస్తుత పరిస్థితుల్లో శృంగార ‘సమ్మతి’ వయసు ఎంత ఉండాలి ? అనే దానిపై కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ ఈనెలాఖారులోగా కేంద్ర ప్రభుత్వానికి అధ్యయన నివేదికను సమర్పించనుంది. శృంగార ‘సమ్మతి’ వయసును తగ్గించాలనే సూచనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పోక్సో కేసుల్లో తీర్పులు ఇచ్చే సందర్భాల్లోనూ పలు కోర్టులు శృంగార ‘సమ్మతి’ వయసును తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయినప్పటికీ అందుకు లా కమిషన్ అనుకూలంగా లేదని తెలుస్తోంది. శృంగార ‘సమ్మతి’ వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే దిశగా కేంద్ర సర్కారుకు లా కమిషన్ సిఫార్సు చేయకపోవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేయడం, శృంగార ‘సమ్మతి’కి సంబంధించిన ప్రాథమిక అంశాలను స్కూల్స్ లో బోధించడం, కౌమార ఆరోగ్య సంరక్షణ చర్యలపై స్టూడెంట్స్ కు అవగాహన కల్పించడం వంటి అంశాలను అమలు చేయాలని కేంద్రానికి లా కమిషన్ సిఫార్సు చేయనుందని అంటున్నారు.
ఏయే దేశాల్లో ఎంత వయసు ?
కొన్ని అరబ్ దేశాలలో శృంగార ‘సమ్మతి’కి చట్టబద్ధమైన వయస్సు నిబంధన లేదు. కానీ వివాహేతర సంబంధాలపై బ్యాన్ అమల్లో ఉంది. శృంగార ‘సమ్మతి’ వయసు.. మాల్దీవులు, యెమెన్‌లలో 9 సంవత్సరాలు, అంగోలా, మెక్సికో, ఫిలిప్పీన్స్, దక్షిణ సూడాన్ లలో 12 సంవత్సరాలుగా ఉంది. శృంగార ‘సమ్మతి’ వయసు జపాన్ లో 13 నుంచి 16 ఏళ్ళు,
అమెరికాలో 16 నుంచి 18 ఏళ్ళు ఉంది. ఆస్ట్రియా, జర్మనీ, సెర్బియా, ఇటలీ, పోర్చుగల్, చైనా దేశాలలో శృంగార ‘సమ్మతి’ వయసు 14 సంవత్సరాలే. అయితే కొన్ని యూరోపియన్ దేశాలలో ఇది 16 నుంచి 17 ఏళ్ళదాకా ఉంది. మాల్టా, వాటికన్ సిటీ సహా అనేక ఇతర దేశాలలో ఇది 18 సంవత్సరాలుగా ఉంది. హాంకాంగ్, కామెరూన్, నైజర్ దేశాల్లో శృంగార ‘సమ్మతి’ వయసు 21 ఏళ్ళు.
Also read :Electric Shock : సూర్య ఫై అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది