Site icon HashtagU Telugu

May Day : జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారింది: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

National Employment Guarantee Scheme has become the backbone of the state development: Deputy CM Pawan Kalyan

National Employment Guarantee Scheme has become the backbone of the state development: Deputy CM Pawan Kalyan

May Day : నేడు మేడే ఈ సందర్భంగా మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్‌ హాలులో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే రూ.6,194 కోట్ల వ్యయం అయిందని వివరించారు. మెటీరియల్‌ కింద రూ.4,023 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 75 లక్షల 23 వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు.

Read Also: Pahalgam Terror Attack : ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాల్జేశారు. మద్య నిషేధమంటూ వచ్చి గత ప్రభుత్వం వ్యాపారం చేసింది. మద్యం కుంభకోణానికి పాల్పడి రూ.3,200 కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్‌ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయి అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. పల్లె పండుగలో భాగంగా ఇప్పటికి రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీని వల్ల ప్రతి రైతుకు నెలకు రూ.4,200 అదనపు ఆదాయం వస్తోంది. రక్తం ధారపోసి పనిచేసేవారు లేకపోతే ఏ నిర్మాణం జరగదు. ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం. మిగతా వృత్తుల్లో ఉన్నవారిలాగే ఉపాధి శ్రామికులు కూడా గొప్పవారే అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ శ్రామికులకు ప్రధానమంత్రి జీవిత బీమా కల్పించినట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుందన్నారు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే వచ్చే పరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఈ మేరకు పవన్‌ సమక్షంలో ఎస్‌బీఐతో పంచాయతీరాజ్‌ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక, ఎండ తీవ్రత కారణంగా చాలా మంది ఉపాధి శ్రామికులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి శ్రామికులు ఉదయం 11 గంటల్లోపు పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ పనులు పెండింగ్‌లో ఉంటే సాయంత్రం నాలుగు తర్వాత చేసేలా చూడాలని సూచించారు. ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో నీడ కోసం చిన్న పాకలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Read Also: Sunny Thomas Passes Away: క్రీడ ప్ర‌పంచంలో విషాదం.. ప్ర‌ముఖ కోచ్ క‌న్నుమూత‌!

 

Exit mobile version