Site icon HashtagU Telugu

Mamata : హత్యాచార ఘటన..16 రోజులైనా సీబీఐ ఏం చేస్తుంది?: మమతా బెనర్జీ ఫైర్‌

Murder incident..What will CBI do for 16 days?: Mamata Banerjee Fire

Murder incident..What will CBI do for 16 days?: Mamata Banerjee Fire

Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐ తీరును ప్రశ్నించారు. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమత మాట్లాడారు.. వైద్యురాలు హత్యాచారానికి గురైన రెండు రోజుల తర్వాత బాధితురాలి తల్లిదండ్రులను కలిశానని ఆమె చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. విపక్షాలు న్యాయం కోరుకోవడం లేదని.. ఆలస్యం కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

బాధితురాలికి న్యాయం కావాలని కోరుకునేవాళ్లు బీజేపీలో లేరన్నారు. బీజేపీ వాళ్లు బెంగాల్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లంతా కుట్రలో మునిగి తేలుతున్నారని మమత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిస్తుందని… రేపిస్టులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని మమత చెప్పుకొచ్చారు. మంగళవారం ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు షెల్స్, వాటర్ క్యానన్లు, లాఠీలను ప్రయోగించారని.. 200 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

ఇక.. తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కోల్‌కతా ఘటన దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. యావత్ భారతదేశం న్యాయం కోరుతోందన్నారు. కానీ కొందరు వ్యక్తులు మృతదేహంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నావ్, హత్రాస్, కథువా మరియు బద్లాపూర్ కేసులకు బీజేపీ వాళ్లే బాధ్యులని ఆరోపించారు. రేప్ కేసుల్లో కాలపరిమితితో కూడిన విచారణ మరియు శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. దీని కోసం మమతా బెనర్జీ చట్టం చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే అత్యాచార నిరోధక చట్టం కోసం తృణమూల్ పార్టీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశపెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

Read Also: Shocking Video : నదిలోకి 50 ఆవులను తోసేసిన దుర్మార్గులు.. 20 ఆవుల మృతి