Site icon HashtagU Telugu

CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు

MSMEs and service sector will be given a big boost in all constituencies in the state: CM Chandrababu

MSMEs and service sector will be given a big boost in all constituencies in the state: CM Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పథాన్ని స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. ఇవి యువతకు ఉపాధిని కల్పించడమే కాక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సచివాలయం నుంచి వర్చువల్‌గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు. టెక్నాలజీని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన ఆయన, భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందన్నారు. భవిష్యత్ యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయి అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

అనేక సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సేవలు అందిస్తాం. దీపం-2 పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని చెప్పారు. అలాగే 21 ప్రముఖ దేవాలయాల్లో అన్నప్రసాదం అందించే ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు ఆలస్యంగా పూర్తవడం వల్ల డయాఫ్రం వాల్ ఖర్చు రెండున్నర రెట్లు పెరిగింది అని ఆయన వివరించారు. విశాఖపట్నాన్ని ముంబయిలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు నగరానికి తరలివస్తున్నాయని, రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

అమరావతిని స్వయం ఆర్థిక ఆధారిత మోడల్‌పై అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోలవరం బనకచర్ల మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిని పర్యాటక, శ్రద్ధాస్థలంగా మాత్రమే కాక, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తలసరి ఆదాయ పరంగా విశాఖ ముందుండగా, శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అని గుర్తించారు. అందువల్ల ప్రతి ఏడాది తలసరి ఆదాయాన్ని బెంచ్‌మార్క్‌ ఆధారంగా సమీక్షిస్తామని పేర్కొన్నారు. పీ-4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి ప్రతి ప్రాంతానికీ సమానంగా అందాలి. క్షేత్రస్థాయిలోనే ప్రాజెక్టుల పురోగతిని అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విధంగా సంక్షేమం, పారిశ్రామికీకరణ, ప్రాజెక్టుల వేగవంతీకరణ వంటి అన్ని అంశాల్లో సమతూకాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

Read Also: Piracy Racket: రూ. 700 కోట్ల వార్షిక ఆదాయం.. పైర‌సీ ముఠా కేసులో సంచ‌ల‌న విష‌యాలు!