TDP: ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక అప్పటివరకూ అధికారం అనుభవించిన నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇదే క్రమంలో జగన్ కు సన్నిహితుడిగా పేరున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ సైతం నిన్న రాజీనామా చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు మోపిదేవి వెంకటరమణ క్లారిటీ ఇచ్చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీలో మరో ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి ఈరోజు రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను కలవబోతున్నారు. ఆయనకు రాజీనామా సమర్పిస్తామని మోపిదేవి వెల్లడించారు. అనంతరం టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు బీద మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరుతున్నట్లు మోపిదేవి ఢిల్లీలో తెలిపారు.
ఈ సందర్భంగా మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం కొత్తేమీ కాదని, గతంలో ఎన్నో పదవుల్లో పనిచేసినట్లు గుర్తుచేశారు. కానీ ఏడాది కాలంగా రేపల్లెలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. అందుకే కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోరాతిఘోరంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, దీంతో ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వీరిలో కొందరు రాజీనామాలు కూడా చేశారన్నారు. లోపం ఎక్కడుందో అధిష్టానం విశ్లేషించుకోవాలని సూచించారు.
మరోవైపు అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నట్లు మోపిదేవి కితాబిచ్చారు. అందుకే ఆయన సారధ్యంలో పనిచేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో టీడీపీలో చేరతానని, ఆ తర్వాత తనకు సముచిత స్ధానం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు.