Site icon HashtagU Telugu

Maharashtra Election Results : ‘మహాయుతి’ గెలుపు పై మోడీ , రాహుల్ రియాక్షన్..

Modi Rahul Maha

Modi Rahul Maha

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి(ఎన్​డీఏ) విజయఢంకా మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. 288 స్థానాలకుగాను అధికార కూటమి 233 స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది. అభివృద్ధికే మహారాష్ట్ర ఓటర్లు పట్టంకట్టారని ముఖ్యమంత్రి శిందే, ఉపముఖ్యమంత్రులు ఫడణవిస్‌, అజిత్ పవార్‌ స్పష్టం చేశారు. ఈ విజయం పట్ల మోడీ (PM Modi) తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీయేకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమవైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతిఒక్క ఎన్డీయే కార్యకర్త కష్టపడ్డారని, వారందరికీ థాంక్స్ చెబుతున్నానన్నారు.

మహారాష్ట్రలో అబద్ధాలు, విభజన రాజకీయాలు ఓటమిపాలయ్యాయని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. మహారాష్ట్రలో సామాజిక న్యాయం విజయం సాధించి వికసిత భారత్ సంకల్పాన్ని దృఢపరిచిందన్నారు. 233 సీట్లలో మహాయుతి కూటమి గెలుపుతో మహనీయుల భూమి పురాతన రికార్డులన్నింటినీ బద్దలుకొట్టిందన్నారు. 50 ఏళ్లలో కూటమిలోని పార్టీలకు ఇది అతిపెద్ద విజయమన్నారు. మరోవైపు ఝార్ఖండ్లో విజయం సాధించిన JMM కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు.

ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మహారాష్ట్ర లో ఓటమి పై స్పందించారు. ఫలితాలపై సమగ్రంగా విశ్లేషిస్తామని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇండియా కూటమికి ఘనవిజయాన్ని కట్టబెట్టినందుకు ఝార్ఖండ్‌ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఝార్ఖండ్‌లో ఫలితాలపై మాట్లాడుతూ రాజ్యాంగంతో పాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి సాధించిన విజయమన్నారు. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని స్థానిక ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అసలు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ సిద్ధాంతాలకు తాము నిజమైన ప్రతినిధులమని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.

Read Also : CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క పిలుపు