Mock Drill : భారత ప్రభుత్వం మే 29న (రేపు)పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లో ఈ డ్రిల్ చేపట్టనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ప్రమాద పరిస్థితులలోనైనా సమర్ధంగా స్పందించేందుకు పౌరులు, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం అని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సరిహద్దుల్లో రక్షణ చర్యలను పటిష్టం చేయడంలో భాగంగా మాక్ డ్రిల్లులు నిర్వహించనున్నారు. గత మే 7న దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట విస్తృతంగా మాక్ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. అదేరోజు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం పాకిస్థాన్, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పీవోకేలోని కీలక ఉగ్రవాద కేంద్రాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ దాడులు పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న వరుస ఉగ్రచర్యలకు భారత తక్షణ ప్రతిస్పందనగా చర్చించబడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థలు సమిష్టిగా పనిచేసే విధంగా ఈ మాక్ డ్రిల్లులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ మాక్ డ్రిల్ వ్యవహారంలో కేంద్రం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ప్రజల భద్రత, ఆత్మరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి డ్రిల్లులు కీలకమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్రిల్‌లో భాగస్వాములవ్వాలని ప్రభుత్వం సూచిస్తోంది.