Wedding Fraud : వరుడు ఫేక్.. వధువు ఫేక్.. బోగస్ పెళ్లిళ్ల స్కాం కలకలం

Wedding Fraud : అన్ని విషయాలలో చాలా ఆదర్శవంతంగా పాలన చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంక్షేమ పథకాల అమలులో మాత్రం విఫలమవుతున్నారు.

  • Written By:
  • Updated On - February 4, 2024 / 11:55 AM IST

Wedding Fraud : అన్ని విషయాలలో చాలా ఆదర్శవంతంగా పాలన చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంక్షేమ పథకాల అమలులో మాత్రం విఫలమవుతున్నారు. సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఫేక్ పెళ్లిళ్ల వ్యవహారం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ సర్కారు నవ దంపతులకు రూ.51వేలు కానుకగా అందించేందుకు ప్రత్యేక స్కీమ్‌ను అమలుచేస్తోంది. రూ.51వేలలో రూ.35వేలు వధువుకు, రూ.10వేలు పెళ్లి సామగ్రి కొనుగోలుకు, రూ.6వేలు పెళ్లి వేడుక ఖర్చులకు కేటాయిస్తారు.  51 వేల రూపాయల కోసం కొంతమంది సామూహికంగా పెద్దఎత్తున ఫేక్ పెళ్లిళ్లు చేయించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన సమాచారం ఆధారంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జనవరి 25న సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఇందులో దాదాపు 568 జంటలు పెళ్లి చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వధూవరులుగా పోజులు ఇచ్చేందుకు కొందరికి డబ్బులిచ్చి తీసుకొచ్చారని తెలిసింది.  ఇలా వచ్చిన వారికి సగటున ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.2వేల దాకా చెల్లించారని పలువురు స్థానికులు ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఈ సామూహిక వివాహ మహోత్సవమంతా (Wedding Fraud) ఫేక్. ఇందులో  వధువుగా కూర్చున్న చాలామందికి  వరుడు లేనే లేడు. దీంతో స్వయంగా వాళ్లే వరమాలలను తమతమ మెడల్లో వేసుకున్నారు’’ అని విమల్ కుమార్ పాఠక్ అనే వ్యక్తి జాతీయ మీడియాకు చెప్పాడు.  ‘‘నేను ఆ సామూహిక వివాహ మహోత్సం చూసేందుకు వెళ్లాను. కొందరు వచ్చి నాతో మాట్లాడి..  పెళ్లికొడుకుగా నటించమన్నారు. అలా నటిస్తే డబ్బులిస్తామని చెప్పారు. చాలామందిని అలాగే ఒప్పించి వరుడిలా, వధువులా తయారుచేసి కూర్చోబెట్టారు’’ అని రాజ్‌కుమార్ అనే వ్యక్తి తెలిపాడు. ఈ సామూహిక వివాహ వేడుకలో వధువులకు వధువులే పూలమాల వేసుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు స్కాం అంతా బయటపడింది. ఈ విజువల్స్‌లో కొంతమంది పురుషులు వరుడిలా దుస్తులు ధరించి.. తమ ముఖాలను దాచుకుంటున్న విషయం కూడా స్పష్టంగా కనిపించింది.

Also Read :UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ

మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ ఫేక్ సామూహిక వివాహ మహోత్సవానికి సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అనంతరం ఈ బండారం బట్టబయలై 15 అరెస్టయ్యారని తెలిసి ఎమ్మెల్యే కేత్కీ  సింగ్ షాకయ్యారు. ‘‘ఈ కార్యక్రమానికి కేవలం రెండు రోజుల ముందు వారు నాకు సమాచారం అందించారు. దాంతో వెళ్లి కార్యక్రమంలో లాంఛనంగా పాల్గొన్నాను.  దీనిపై ఇప్పుడు పూర్తి విచారణ జరుగుతోంది’’ అని తెలిపారు. ఫేక్ పెళ్లి చేసుకున్న వారి వివరాల ఆధారంగా అధికారులు దర్యాప్తును మొదలుపెట్టారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఈ విచారణను నిర్వహిస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమంలో మ్యారేజ్ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.51వేల నగదు బదిలీ జరగదని అధికారులు స్పష్టం చేశారు.