Car Parking : ట్రాఫిక్‌ని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన

కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Maharashtra Govt new regulation to regulate traffic

Maharashtra Govt new regulation to regulate traffic

Car Parking : మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పార్కింగ్ స్థలం ఉన్నవారికి మాత్రమే కార్లు విక్రయించమని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఇకపై, కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన త్వరలో అమలులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ కారణంగా ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులుకాయాల్సి వస్తోందని, అంతేకాకుండా అంబులెన్స్‌, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. వాహనాల రద్దీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలు పార్కింగ్‌ స్థలం లేక తమ కార్లను రోడ్లపైనే పార్క్‌ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దీనికారణంగా ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోందన్నారు. ఇకపై కార్లు కొనుగోలు చేసేవాళ్లు పార్కింగ్‌ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు రావచ్చు అని మంత్రి తెలిపారు.

అయితే మధ్యతరగతి కుటుంబాలకు కార్లు కొనుగోలు చేయకూడదని వారు చెప్పడం లేదని, కానీ వారి కోసం తగిన పార్కింగ్ స్థలాలు ఏర్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్లు మంత్రి సర్నాయక్ చెప్పారు. ఈ కొత్త నిబంధనలను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నారని మంత్రి ప్రతాప్ సర్నాయక్ చెప్పారు. అలాగే, ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు, మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తెలిపారు.

Read Also: Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

 

  Last Updated: 15 Jan 2025, 01:42 PM IST