Chakali Ilamma Jayanti : నేడు చిట్యాల ఐలమ్మ జయంతి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..వీరనారి చిట్యాల ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక.. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి అన్నారు.
Read Also: Sanjay Raut : పరుపు నష్టం కేసులో ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష
ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాం. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ ముందుంటుంది. పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా జరపడం మొదలు పెట్టిందని గుర్తు చేశారు. చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఐలమ్మ తిరుగుబాటు అందరికీ గుర్తుండేలా జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి కదిలించిన నాయకురాలు ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్తులో అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.