KTR Vs Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటీ వ్యాఖ్యల పై స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ తొలి వారంలో అరెస్టులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు.
త్వరలోనే బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని..బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. తాము ఎలాంటి బాంబులకు భయపడేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.
దొంగ కేసులు పెడితే పెట్టుకోవాలని..ముందు పొంగులేటి తన ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. తాము చంద్రబాబు, వైఎస్‌ఆర్‌తోనే కొట్లాడినామని గుర్తు చేసారు. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా అంటూ వ్యాఖ్యానించారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు అంటూనే.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై తాము వచ్చాక లెక్క తెలుస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తామని… చావుకు మేం భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు.
సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నారు. విద్యుత్‌ను వ్యాపార ధోరణిలో చూడొద్దని తెలిపారు. విద్యుత్ భారం కాదని.. బాధ్యతగా ప్రభుత్వం భావించాలని సూచించారు. పేదల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ.963 కోట్ల చార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే.. ఒక్క యూనిట్‌కు 50 రూపాయలా.. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.