Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 80 శాతం మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్‌లు పంపిణీ చేశామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే ఈ కిట్లు విద్యార్థులకు అందించామన్నారు. మిగిలిన 20 శాతం మంది విద్యార్థులకు కూడా ఈ నెల 20వ తేదీలోగా కిట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా, అంతమందికి తల్లికి వందనం నిధులు ఇవ్వడమే మా లక్ష్యం. కానీ కొందరి ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
Read Also: Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు
మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యారంగంలో నాణ్యత కోసం 9,600 పాఠశాలల్లో “వన్ క్లాస్ – వన్ టీచర్” మోడల్ అమలులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో వచ్చే ఏడాది తేలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచడమే మా లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ 16 సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. అలాగే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖను తీవ్రంగా నాశనం చేశారంటూ లోకేష్ ఆరోపించారు. మునుపటి మంత్రి ఏమి చేశారో అర్థం కాదు. ప్రభుత్వ బడుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసుకునేందుకు మాకు వంద రోజులు పట్టింది అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమన్నారు. విద్యాశాఖలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు తగిన వసతులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాఠశాలల నాణ్యత పెంపుతో పాటు విద్యార్థుల చేరికలు పెంచడంపై కూడా మంత్రి లోకేష్ స్పష్టమైన దృష్టి ఉంచినట్లు కనబడుతోంది.
Read Also: Gambhir Mother: ఐసీయూలో గంభీర్ తల్లి.. స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియా హెడ్ కోచ్!